1 Samuel 10

1అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసికొని సౌలు తలమీద నూనె పోసి అతణ్ణి ముద్దుపెట్టుకొని, <<యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు>> అని ఇంకా ఇలా చెప్పాడు, 2<<ఈ రోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు <నువ్వు వెదకుతున్న గాడిదలు దొరికాయి> మీ నాన్న గాడిదల విషయం మరచిపోయి <నా కొడుకును వెదకడానికి నేనేం చెయ్యాలి> అని నీ కోసం బాధ పడుతున్నాడు> అని చెబుతారు.

3తరువాత నువ్వు అక్కడినుండి వెళ్లి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరకి వెళ్లే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు. 4వారు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి.

5ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. 6యెహోవా ఆత్మ నీపైకి బలంగా దిగివస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనస్సు వస్తుంది.

7దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి.

8నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళినప్పుడు, దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి దిగి వస్తాను. నేను నీ దగ్గరకి వచ్చి నువ్వు ఏమి చేయాలో చెప్పేవరకు ఏడు రోజులపాటు నువ్వు అక్కడే ఉండిపోవాలి.>>

9సమూయేలు దగ్గర నుండి వెళ్లిపోడానికి బయలుదేరినపుడు దేవుడు సౌలుకు నూతన మనస్సు అనుగ్రహించాడు. ఆ రోజే ఆ ఆనవాళ్ళు కనబడ్డాయి.

10వారు ఆ కొండ దగ్గరకి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురు వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు.

11గతంలో అతనిని ఎరిగిన వారంతా అతడు ప్రవక్తలతో కలసి ప్రకటించడం చూసి, <<కీషు కుమారునికి ఏమయ్యింది? సౌలు కూడా ప్రవక్త అయ్యాడా?>> అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. 12అక్కడ ఉన్న ఒక వ్యక్తి<<అతని తండ్రి ఎవరు?>> అని అడిగాడు. అందువల్ల సౌలు కూడా ప్రవక్త అయ్యాడా? అనే సామెత పుట్టింది. 13తరువాత అతడు ప్రకటించడం ఆపివేసి ఎత్తైన స్థలానికి వచ్చాడు.

14సౌలు చిన్నాన్న అతణ్ణి, అతని పనివాణ్ణి చూచి, <<మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు?>> అని అడిగినపుడు అతడు<<గాడిదలను వెదకాలని వెళ్ళాం, అవి కనబడనప్పుడు సమూయేలు దగ్గరకి వెళ్ళాం>> అని చెప్పాడు. 15సౌలు చిన్నాన్న, <<సమూయేలు నీకు ఏమి చెప్పాడో ఆ విషయాలు నాకు కూడా చెప్పు>> అని అడిగాడు. 16సౌలు అతనితో, <<గాడిదలు దొరికాయి అని అతడు చెప్పాడు>> అని చెప్పాడు గానీ రాజ్య పరిపాలనను గురించి సమూయేలు చెప్పిన మాట చిన్నాన్నకు చెప్పలేదు.

17తరువాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధికి ప్రజల్ని పిలిపించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, 18<<ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తీయుల ఆక్రమణ నుండి, మిమ్మల్ని బాధపెట్టిన ప్రజలనుండి విడిపించాను. 19అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. <మా మీద ఒకరిని రాజుగా నియమించు> అని కోరుకొన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు, మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి.>>

20ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ సమూయేలు సమకూర్చినపుడు బెన్యామీను గోత్రంపై చీటీ పడింది. 21బెన్యామీను గోత్రంవారి వంశాలు, కూటమి పేరుల ప్రకారం సమకూర్చినపుడు మత్రియుల వంశం ఏర్పడింది. తరువాత కీషు కుమారుడైన సౌలు ఎన్నికయ్యాడు. ప్రజలు అతనిని వెదగ్గా అతడు కనబడలేదు.

22అప్పుడు వారు <<ఇక్కడికి రావలసి మనిషి ఇంకెవరైనా ఉన్నారా>> అని యెహోవా దగ్గర వాకబు చేసినప్పుడు యెహోవా, <<అతడు సామానుల్లో దాక్కున్నాడు>> అని చెప్పాడు. 23వారు పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుండి అతణ్ణి తీసుకువచ్చారు. అతడు సమూహంలో నిలబడినప్పుడు భుజాల నుండి ఇతరులకంటే పైకి ఎత్తైనవాడుగా కనబడ్డాడు.

24అప్పుడు సమూయేలు, <<యెహోవా ఏర్పరచుకున్నవాణ్ణి మీరు చూశారా? ప్రజలందరిలో అతని వంటివాడు ఎవరూ లేడు>> అని చెప్పినప్పుడు, ఆ ప్రజలంతా ఆనందంతో, <<రాజు చిరకాలం జీవిస్తాడు గాక>> అంటూ బిగ్గరగా కేకలు వేశారు.

25తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని ప్రజలకి వినిపించి, ఒక గ్రంథంలో రాసి యెహోవా సన్నిధిలో దానిని ఉంచాడు. తరువాత సమూయేలు అక్కడ సమావేశమైన వారందరినీ తమ తమ ఇళ్ళకు పంపివేశాడు.

26సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుని ఆత్మ ద్వారా హృదయంలో ప్రేరేపణ పొందిన యుద్ధవీరులు అతని వెంట వెళ్లారు. అసూయపరులూ, దుష్టులూ అయిన కొందరు, <<ఈ మనిషి మనల్ని ఏలుతాడా?>> అని చెప్పుకొంటూ అతడిని పట్టించుకోకుండా, కానుకలు ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు ఏమీ పట్టించుకోకుండా చెవిటి వాడిలాగా నెమ్మదిగా ఉండిపోయాడు.

27

Copyright information for TelULB